UPDATED 22nd JULY 2020 WEDNESDAY 9:30 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): అత్యాచారానికి గురైన బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం అందచేసినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో సామూహిక అత్యాచార గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను మంత్రి బుధవారం పరామర్శించారు. అనంతరం స్థానిక విలేఖరులతో మంత్రి వనిత మాట్లాడుతూ మహిళలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ కేసులో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోక్సో చట్ట ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన రూ.25000/-తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని బాధితురాలి కుటుంబానికి అందచేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. పుష్పమణి, తదితరులు పాల్గొన్నారు.







