UPDATED 14th MARCH 2022 MONDAY 02:00 PM
China Shenzhen Lock Down: ఒకప్పటి కరోనా పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ సిటీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రపంచమంతా కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో మళ్లీ చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఒకటి విజృంభించడం ఆందోళన రేకిత్తిస్తోంది. కొత్త కరోనా కేసులను పూర్తి నిర్మూలించేందుకు చైనా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు కనిపిస్తున్నాయి. చైనాలోని హైటెక్ సిటీ ఆఫ్ షెన్‌జెన్ (Shenzhen) మరో నగరం లాక్‌డౌన్‌లోకి వెళ్లనుంది.
ఈ హైటెక్ సిటీ 17 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నగరంలో అన్ని బస్సులు మెట్రో సేవలు నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తి కారణంగా అన్ని కమ్యూనిటీలు, గ్రామాలు కూడా మూతపడనున్నాయి. షెన్‌జెన్ సిటీ ఫిబ్రవరి చివరి నుంచి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతోంది.వచ్చే వారం నగరవ్యాప్తంగా మూడు రౌండ్ల కోవిడ్-19 పరీక్షలను చైనా అధికారులు నిర్వహించనున్నారు. నగరవాసులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, అందరూ ఇంట్లో నుంచే పనిచేయాలని నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే బయటకు రావాలని నగర అధికారులు కోరారు.
వరుసగా రెండు రోజులుగా నగరంలో 1,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో కొత్త కేసులు 3,100 కంటే ఎక్కువగా ఉన్నాయని జాతీయ ఆరోగ్య కమిషన్ ఆదివారం నివేదించింది. ఈ కరోనా కొత్త కేసులు ఈ స్థాయిలోనమోదు కావడం.. రెండేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు అంచనా వేస్తున్నారు. నివేదిక ప్రకారం.. షెన్‌జెన్ సిటీ నుంచి బయటికి వెళ్లే ప్రయాణికులందరూ తప్పనిసరిగా నెగిటివ్ న్యూక్లియిక్ యాసిడ్ టెస్టు ఫలితాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
చైనాలో వుహాన్ సిటీ తర్వాత అత్యధికంగా షెన్‌జెన్ నగరంలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2019 డిసెంబర్‌లో వుహాన్‌లో మొట్టమొదటగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు కరోనా బారినపడి 6 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు.







