UPDATED 12th SEPTEMBER 2018 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: కేరళ వరద బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున రూ.51 కోట్ల మేర సహాయనిధిని కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమత్రి నిమ్మకాయల చినరాజప్ప అందజేశారు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం సచివాలయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిశ్రమల శాఖా మంత్రి ఇ.పి. జయరాజన్, రెవెన్యూ శాఖా మంత్రి చంద్రశేఖరన్ , జలవనరుల శాఖా మంత్రి మాధ్యూస్ థామస్, రవాణా శాఖా మంత్రి ఎ.కె. శశేంద్రన్, నౌకయాన శాఖా మంత్రి రామచంద్రన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్ జోస్, రెవెన్యూ కార్యదర్శి పి.సి. కురియన్ లను చినరాజప్ప కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున సేకరించిన వరద సహాయ నిధి చెక్కులను చినరాజప్ప కేరళ మంత్రులకు అందజేశారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో
కేరళ మంత్రులతో పాటు పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కేరళ వరదల పరిస్ధితికి చలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.10 కోట్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారన్నారు. అలాగే తక్షణం వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ప్రజలందరూ ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించిందని చినరాజప్ప తెలిపారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించి ప్రభుత్వోద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించి తమ ఉదారతను చాటుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా రూ. 20 కోట్లు, ఆంధ్రప్రదే రాష్ట్ర రవాణా సంస్ధ ఉద్యోగులు రూ.3 కోట్లు విరాళాలను ప్రభుత్వానికీ అందజేశారని ఆయన తెలిపారు. కేవలం విరాళాలకే పరిమితం కాకుండా వరద బాధితులకు యుద్దప్రాతిపదికన నిత్యావసర వస్తువులు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవచూపి పౌరసరఫరాల శాఖ ద్వారా 2014 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని యుద్దప్రాతిఫదికన కేరళకు పంపించారన్నారు. విపత్తులు దేశంలో ఎక్కడ సంభవించినప్పటికీ బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంటుందని చినరాజప్ప తెలిపారు. వరద బాధితులకు సేవలందించేందుకు గాను తమ ప్రభుత్వం అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సహాయక బృందాలను కేరళకు పంపించామన్నారు. తోటివారికి కలిగిన కష్ట నష్టాలకు కన్నీటితో పాటు చేయూత నివ్వడంలో ఆంధ్రప్రజలు ఎప్పుడూ ముందుంటారని, వరదలకు గురైన ప్రాంతాల్లోని ప్రజల జీవితాలు త్వరలోనే చిగురిస్తాయనే ఆకాంక్షను చినరాజప్ప వ్యక్తం చేశారు. వరద సహాయక విషయంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన వైస్ ఛైర్మన్ ఎ.బాబు చేసిన కృషిని చినరాజప్ప కొనియాడారు. మానవీయ విషాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి సహాయాన్ని అందించినందుకు కేరళ ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖా మంత్రి జయరాజన్ కృతఙ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సేవలను కేరళ ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును త్వరలోనే కలుసుకుని కృతఙ్ఞతలు తెలియజేస్తామన్నారు.







