UPDATED 24th FEBRUARY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: ఉండూరు ఆటో పాయింట్ సాధన కోసం శ్రీ సిద్ధి వినాయక ఆటో ఓనర్స్, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉండూరు గ్రామంలో యూనియన్ సభ్యులు ఆదివారం ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు గోరింట అప్పారావు మాట్లాడుతూ మా యూనియన్ లో సుమారు 35 ఆటోలు ఉన్నాయని, మాకు ఆటోలే జీవనాధారమని అన్నారు. సామర్లకోట పట్టణంలో సుమారు తొమ్మిది ఆటో యూనియన్లు ఉన్నాయని, ప్రతీ ఆటో యూనియన్ పాయింట్లను ఏర్పాటు చేసుకుని ఆటోలు నడుపుతున్నారని అన్నారు. ఎవరి ఏరియాకు వారు పాయింటు తెచ్చుకుని పాసింజర్లను ఎక్కించుకుని వెళ్తున్నారని, అయితే మా యూనియన్ సభ్యులు ఉండూరు పాసింజర్లను ఎక్కించుకుని వెళ్తున్నామని అన్నారు. అయితే ఉండూరు మీదుగా వెళ్లే ఆటోలతో స్థానిక యూనియన్ సభ్యులు తరచూ గొడవలు పడుతున్నారని, రైల్వే స్టేషన్ సమీపంలో ఉండూరు పాయింట్ గా రెండవ ఆటో యూనియన్ కు అనుమతి మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షల్లో గుబ్బల రామకృష్ణ, పి. వీర్రాజు, టి.అప్పారావు, ఎస్. లోవరాజు, టి .రామకృష్ణ, కె. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.







