UPDATED 18th JUNE 2019 TUESDAY 9:00 PM
రాజానగరం: రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని, వైద్య రంగాన్ని మెరుగుపర్చేందుకు కృషి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవల సంస్కరణల కమిటీ సభ్యుడు డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర వైద్య సేవల సంస్కరణల కమిటీ సభ్యునిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాలకు విచ్చేసిన ఆయనను కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన సంస్కరణలు తీసుకొస్తున్నారని, వైద్యరంగంలో మన దేశంలో మన రాష్ట్రం ముందుండాలని సీఎం కోరుకుంటున్నారని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే సీఎం లక్ష్యంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెఎల్ఆర్ లెనోరా విద్యా సంస్థల చైర్ పర్సన్ కుమారుడు సిద్ధార్ధ, కార్యదర్శి డాక్టర్ వై. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, డైరెక్టర్ (పిజి స్టడీస్) డాక్టర్ బి. లక్ష్మణరావు, ఏ. ప్రసాద్ చౌదరి, డాక్టర్ షరాజ్ షైక్, డాక్టర్ ఉదయ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







