* మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు
UPDATED 5th OCTOBER 2018 FRIDAY 6:00 PM
పెద్దాపురం: విద్యార్థి దశ నుంచి విద్యతో పాటు వివిధ రంగాల్లో యువత ప్రతిభ కనబర్చాలని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. సెట్రాజ్ కార్యాలయం సూపరిండెంట్ జి.ఎ. స్వామి అధ్యక్షతన స్థానిక గౌరీకోనేరు కాలనీలో గల ముప్పన రామారావు వీవర్స్ కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన డివిజన్, జిల్లాస్థాయి యువజనోత్సవాలు-2018 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు యువతీ యువకుల్లో దాగియున్న ప్రతిభను వెలికితీసి యువతను ప్రోత్సహిస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లోను యువత నైపుణ్యం కలిగి ఉన్నపుడు వారు ఉన్నతమైన స్థానంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండ క్రమశిక్షణతో క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు రావాలన్నారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి పొందిన విజేతలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపడం జరుగుతుందని అన్నారు. యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన సమైక్యతా శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులను ఆయన అభినందించారు. అనంతరం యువతీ యువకులు వివిధ సాంస్కృతిక అంశాలలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా లక్ష్మి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సుబ్బారావు, బి.ఎస్. ప్రకాశరావు, టి.వి. సత్యనారాయణ, సాయిశివరాజ్ ఉన్నారు. ఆదిత్య, మహారాణీ కళాశాలల నుంచి సుమారు 175 మంది యువతీ, యువకులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమోంటోలను అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, వార్డు కౌన్సిలర్లు, సెట్రాజ్ కార్యాలయం టెక్నికల్ సూపర్ వైజర్ ఎం. శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ బి.వి. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.







