UPDATED 6th AUGUST 2018 MONDAY 6:00 PM
పెద్దాపురం: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సాధికార మిత్రలు వ్యవహరిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన స్థానిక మరిడమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో సోమవారం సాధికార మిత్రల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలో 482 మంది సాధికార మిత్ర సభ్యులు, అలాగే ఆరుగురు రిసోర్స్ పర్సన్స్ ఉన్నారని తెలిపారు. ఒక్కొక్క సాధికార మిత్ర 35 కుటుంబాలకు చెందిన సమస్యలను తెలుసుకుని అధికారులకు, ప్రభుత్వానికి తెలియచేస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్రిందిస్థాయి వారికి చేరువవుతున్నవో లేదో సమాచారం తెలుసుకోవడం, సమస్యలు పరిష్కరించడం సాధికార మిత్రల ద్వారానే జరుగుతుందని తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్లు, తదితర అభివృద్ధి పనులు డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు రెండు సార్లు జీతాలు పెంచడం జరిగిందని, పిల్లలు, గర్భిణీలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం కోసం బాలసంజీవిని కార్యక్రమం చేపట్టి పోషకాహార సరుకులతో కూడిన కిట్లు అందచేస్తున్నామని తెలిపారు. అన్నాక్యాంటిన్ పనులు చురుకుగా సాగుతున్నాయని త్వరలోనే క్యాంటిన్ ప్రారంభించి రూ. 5 కే భోజనం, టిఫిన్ అందచేస్తామని, అలాగే అర్హులైన వారికి అందరికి ఇళ్లు పథకం ద్వారా ఇళ్లును అందచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధిలోకి చేసి పేదప్రజలకు వైద్య సేవలు అందచేస్తున్నామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ సాధికారమిత్ర పట్టణంలో వారికి కేటాయించిన కుటుంబాలను పరిశీలించి నివేదికను తయారుచేయడం జరిగిందని తెలిపారు. ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరువ చేయడంలో సాధికార మిత్ర ఒక మంచి కార్యక్రమం అని అన్నారు. అనంతరం మైనార్టీలకు నారా హమారా పథకాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా ముస్లిమ్ ఇమామ్లను సాలువ కప్పి మంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కురుపూరి రాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, మెప్మా టిపిఆర్వో శైలజ, సిడిపివో ఆదుర్తి విజయలక్ష్మి, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతికరాజు, కౌన్సిలర్లు, సాధికార మిత్రలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.







