--కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
--7 నుంచి నామినేషన్లు
--29న పోలింగ్
--సెప్టెంబరు 1 న ఓట్ల లెక్కింపు
UPDATED 3rd AUGUST 2017 THURSDAY 8:00 PM
కాకినాడ : ఎట్టకేలకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈమేరకు ఈనెల 29వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. 7వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న పరిశీలిస్తారు. 16లోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబరు ఒకటో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా ఇప్పటికే డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. మొత్తం 2.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ కార్పొరేషన్ కు ఏడేళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. గత ఏడాది నవంబరు లోపు ఎన్నికల నిర్వహణ జరుగుతుందని ఆశించినా ఆచరణకు నోచుకోలేదు. వివిధ సాంకేతిక సమస్యలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 2005లో ఎన్నికైన కౌన్సిల్ గడువు 2010తో ముగిసింది. ఆ తరువాత ఎన్నికలు జరగలేదు. తాజాగా ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోందంటూ గతంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు గత ఏడాది నవంబరు లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం తరఫున హైకోర్టుకు అందజేసినా కొన్ని కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. దీనిపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ప్రభుత్వం తరఫున శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఒక అధికారి కోర్టుకు హాజరు కానున్నారు. కాకినాడ కార్పొరేషన్ కు సంబంధించిన కేసు కావడంతో హైకోర్టుకు హాజరయ్యేందుకు మున్సిపల్ కమిషనర్ అలీంబాషా గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు.గతంలో ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ అమలు కాకపోవడంపై కోర్టు ధిక్కార కేసు విచారణ జరుగుతున్న తరుణంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు షెడ్యుల్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ ఎంపిక ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి.







