UPDATED 3rd FEBRUARY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: ఎన్నికలల్లో ఇచ్చిన వాగ్దానాలు నూరుశాతం పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం, బోయినపూడి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ, పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వికెరాయపురం నుంచి వేట్లపాలెం రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి రూ. ఆరు కోట్లతో ప్రతిపాదనలు పంపామని, త్వరలో ఈ పనులు చేపడతామని తెలిపారు. వృద్దులకు రూ.వెయ్యి నుంచి రెండు వేలు, డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు పసుపు-కుంకుమ క్రింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అలాగే డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందిస్తామని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు, మంచినీటి సౌకర్యాలు కల్పించామని, గత నాలుగున్నర సంవత్సరాల్లో అర్హత గల ప్రతీ ఒక్కరికీ తెల్లరేషన్ కార్డులు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పింఛన్లు అందచేస్తున్నామని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు కూడ ఆర్థికంగా ఎదిగితే కుటుంబ పోషణ సులభమవుతుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారికి రుణాలు అందచేసి ఎంతో సహకారం అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోయి ఆర్థికలోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. త్వరలో రైతులను ఆదుకొనేందుకు ఎకరానికి రూ.2500 ఆర్థిక సహాయం అందించడానికి సమాలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వికెరాయపురంలో పింఛన్లు క్రింద 587 మందికి రూ.17 లక్షల 76 వేల 500, పసుపు-కుంకుమ క్రింద డ్వాక్రా మహిళలకు 142 గ్రూపులకు రూ.కోటి 37 లక్షల చెక్కులు, బోయినపూడి గ్రామంలో పింఛన్లు క్రింద 185 మందికి రూ.5 లక్షల 64 వేలు, పసుపు-కుంకుమ క్రింద 35 గ్రూపులకు రూ.36 లక్షల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. వికెరాయపురంలో కరెంటు ప్రమాదంలో మరణించిన పాడి గేదెలకు నష్టపరిహారం క్రింద రూ.లక్షా 80 వేలు చెక్కులను పాడి రైతులకు అందచేశారు. అనంతరం వికెరాయపురం, బోయినపూడి, మామిళ్లదొడ్డి గ్రామాల్లో రూ.ఒక కోటి 59 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ల విజయలక్ష్మి, ఎంపీడీవో కె. స్పప్న, తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఈవోపీఆర్డీ సిహెచ్ జగ్గారావు, ప్రత్యేకాధికారి రాజశేఖర్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ అడబాల చిట్టిబాబు, మాజీ సర్పంచ్ కుర్రా రాజు, నీటి సంఘం అధ్యక్షుడు అడబాల రాజా, తదితరులు పాల్గొన్నారు.







