UPDATED 9th DECEMBER 2017 SATURDAY 7:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదామాత 165వ జన్మతిథి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఏకవార రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో మాతృశ్రీ శ్రీ శారదామాత శోభాయాత్రను భక్తులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ అధ్యక్షతన నిర్వహించిన ఆధ్యాత్మిక సభకు ముఖ్య అతిధులుగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ గణితావధాని తోటకూర సాయిరామకృష్ణ, సొసైటీ అధ్యక్షులు తోటకూర శ్రీనివాస్, కార్యదర్శి విశ్వనాథ్ హాజరై మాట్లాడారు. శారదామాత జీవితం యావత్ మహిళా లోకానికే ఎంతో ఆదర్శమన్నారు. స్త్రీలు తమ తమ దైనందిక పనులు నిర్వర్తించుకొంటూ దైవారాధన ఏ విధంగా చేయవచ్చునో ఆచరించి చూపిన శారదామాత ఇతరులలో తప్పులను ఎంచకూడదని, ముందుగా మన తప్పులను తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలని ఆమె జీవిత చరిత్ర చదివిన ప్రతీ ఒక్కరికి అర్థమవుతుందన్నారు. సాయంత్రం ఇంద్రగంటి గోపాలశర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలు, లలితా సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన, మంత్రపుష్పం, ఆరాత్రికం, సంకీర్తనలతో ఆద్యంతం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ శారదామాత మహాదాన్నపథకం లబ్ధిదారులకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలలో సమితి సభ్యులు నువ్వుల వెంకటరాజు, టి.వి.వి. సత్యనారాయణ, పెంటపాటి మల్లికార్జునరావు, నువ్వుల బాబ్జి, తోటకూర సూర్య ప్రభాకరరావు, టి.వెంకటేశ్వరావు, తెలుగుంట్ల నరసింహారావు, నువ్వుల సూర్య చంద్రరావు, ఎం.శ్రీనివాస్, మాచరరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







