UPDATED 21st SEPTEMBER 2017 THURSDAY 10:00 PM
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబై. అఖలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను, భక్తకోటిని ఆహ్వానిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి అక్టోబరు 1 వరకు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీనివాసుని అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం ముహూర్తం నిర్ణయించి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఆలయ శుద్ధి చేసి, అలంకరణలు చేపట్టింది. ఉత్సవాల ప్రారంభ సూచికగా శుక్రవారం భూమాతకు పూజలు చేసి మట్టిని సేకరించి నవ ధాన్యాలను చల్లి అంకురార్పణ ఘట్టానికి తెరలేపనుంది. శనివారం సాయంత్రం 5.48 నుంచి 6 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం శ్రీనివాసుడు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో వూరేగనున్నారు. ఈ ఘట్టంతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. తిరుమల క్షేత్రం రోజురోజుకు దేదీప్యమానంగా వెలుగొందుతోంది. టిటిడి ఉద్యాన, విద్యుత్ శాఖలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు చేపట్టాయి. ఫల, పుష్ప, ఛాయా చిత్ర ప్రదర్శనల ఏర్పాట్లు అంత్యదశలో ఉన్నాయి. ఇవి యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈసారి కూడా ఉత్సవాల్లో సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కళాకారులు ఇసుకపై ఉగ్ర నరసింహస్వామికి ప్రాణం పోశారు. తిరుమల దివ్యక్షేత్రం ఇలవైకుంఠంలా అలరారుతోంది. విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతోంది. ఎక్కడ చూసినా మిరమిట్లుగొల్పే విద్యుత్ కాంతులు, దేవతల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి ఆలయాన్ని చూడటానికి వేయి కన్నులు చాలవన్నట్లుగా ఉంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ కొరత లేకుండా లడ్డూ ప్రసాదం అందించడానికి సుమారు 7 లక్షల లడ్డూలను టిటిడి నిల్వ చేసింది. బ్రహ్మోత్సవాలతో పాటే తమిళులు అత్యంత పవిత్రంగా భావించే పురటాసి మాసం మొదటి శనివారంతో పాటు దసరా సెలవులు ప్రారంభమవుతున్నాయి. మూడు రకాలుగా కలిసివస్తున్నందున యాత్రికుల రద్దీ అత్యధికంగా ఉంటుందని దేవస్థానం ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీవారి వాహనసేవల సందర్భంగా తిరువీధుల్లో ముందు భాగంలో అలరించడానికి వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు తరలివస్తున్నారు. కోలాటాలు, డప్పువాయిద్యాలు, నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి వందలాది బృందాలు చేరుకున్నాయి. తిరువీధుల్లో భక్తులను అలరించడానికి కళావేదికలను ఏర్పాటు చేసింది. తిరువీధుల్లో సప్తద్వారాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.







