UPDATED 7th JUNE 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని తహసీల్దార్ ఎల్. శివకుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ శివకుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాలు, రేషన్ కార్డుదారులు, సాంఘిక భద్రతా పింఛనుదారుల కుటుంబాలలో అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు పొందేట్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే శాశ్వతంగా వలస వెళ్లిన, చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించి జాబితాలను సవరించాలన్నారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ ప్రాంత ఓటరు జాబితాలను కూలీలకు చదివి వినిపించి, కూలీల కుటుంబాలలో అర్హత ఉండి జాబితాలలో లేని వారిని నమోదు కోసం సంబంధింత అధికారులకు తెలియచేయాలన్నారు. అన్ని రేషన్ దుకాణాలలో డీలర్లు, విఆర్వోలు సంబంధిత ప్రాంత ఓటరు జాబితాలను కీ రిజిష్టరులోని సమాచారంతో పరిశీలన చేసి ఆయా కార్డుదారుల కుటుంబాల వ్యక్తుల నమోదు, తొలగింపులను గుర్తించాలన్నారు. అలాగే డిగ్రీ, ఆపై స్థాయి కళాశాలల యాజమాన్యాల నుంచి అడ్మిషన్ డేటా ఆధారంగా 1.1.2018 నాటికి ఓటు హక్కు వయస్సు కలిగిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించి అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతీ వ్యక్తిని జాబితాలో నమోదు చేయాలని, వివిధ కారణాలపై తొలగింపులు జరపవలసినపుడు సమగ్రమైన పరిశీలన జరిపిన తరువాతే తొలగించాలని, జనాభా, లింగ, వయో నిష్పత్తులను పాటిస్తూ ఖచ్చితమైన ఓటరు జాబితాలను రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిడివో కె. స్వప్న, ఎం.ఎస్.వో విశ్వేశ్వరరావు, ఎలక్షన్ టిడి కృష్ణ, ఉపాధి హామీ ఎపివో సుధారాణి, ఆర్ఐ రాజేష్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు, ఉపాధిహామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







