UPDATED 12th SEPTEMBER 2019 THURSDAY 8:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్) : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెక్ ఫెస్ట్ ఆదిత్య వేద-2కె19కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ "వేద" పేరిట ఈనెల 13,14 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పాల్గొనే ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కళాశాలల నుంచి నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చని అని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు "వేద' ద్వారా వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులతో ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఇందులో ప్రాజెక్టు, పోస్టర్, పేపర్ ప్రజంటేషన్స్, తదితర విభాగాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ జాతీయస్థాయి ఈవెంట్ కు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, వివిధ ప్రాంతాల నుంచి హాజరుకానున్న విద్యార్థులకు వసతి సౌకర్యం కలుగచేస్తామని పేర్కొన్నారు. విద్యార్థిలోని సృజనాత్మక భావాలను పరస్పరం పంచుకొని మరింత జ్ఞానం పెంపొందించుకునేందుకు ఆదిత్య వేద-2కె19 ఒక చక్కని వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్, తదితరులు పాల్గొన్నారు.







