ఇంజనీరింగ్ విద్యలో మూలాలపై పట్టు సాధించాలి

UPDATED 15th DECEMBER 2018 SATURDAY 5:30 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో యువ ఇంజినీర్లకు అవగాహనా సదస్సు శనివారం జరిగింది. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ హెచ్ఆర్ జోసెఫ్ రాయ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. యువ ఇంజినీర్లు తాము అభ్యసించే ఇంజనీరింగ్ విద్యలో మూలాలు అభ్యసించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ మూలాలపై గట్టి పట్టు సాధిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. ప్రతీ వ్యక్తిలోనూ నాయకత్వ లక్షణాలు ఉంటాయని, అయితే నాయకుడిగా ఎదగడం ఒక కళని, ముఖ్యంగా ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులు నాయకులుగా గుర్తింపు పొందుతారని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ ప్రభావం ఎంతగానో ప్రజలపై పడిందని గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు పత్రికా పఠనం అలవాటు చేసుకోవాలని అన్నారు. మరో ముఖ్య అతిధి రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రతీ సంవత్సరం ఫ్రెషర్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, భారతదేశంలో ప్రతీ ఏటా ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్నవారిలో అత్యధికులు ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. గతంలో మానవులు చేసే పనులు ప్రస్తుతం యంత్రాలు చేస్తున్నాయని, ఇది వినూత్నశకమని, దేశాన్ని ప్రగతిపథంలో పయనింపచేసే మార్గదర్శకులు యువతని అన్నారు. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు యువ ఇంజినీర్లకు ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అధునాతన సాంకేతిక విజ్ఞానంపై విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని అన్నారు. గత కొంతకాలంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నవారిలో అత్యధికులు విజ్ఞానమే పెట్టుబడిగా ముందుకు వస్తున్నారని, విజ్ఞానం ప్రాధాన్యత గుర్తించాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిధులను కళాశాల యాజమాన్యం దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యా సంస్థల సిఇవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.లీలావతి, మెకానికల్. మైనింగ్, పెట్రోలియం, సివిల్, తదితర విభాగాల అధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.                          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us