రెడ్ క్రాస్ సంస్థ సేవలు స్ఫూర్తిదాయకం

* జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి

UPDATED 14th JUNE 2020 SUNDAY 7:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): పేదలను ఆదుకోవడంలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లాకలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా అధ్యక్షులు డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని యూత్ ఫర్ సర్వీస్ ఆధ్వర్యంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా వారం రోజుల పాటు రక్తదానం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే మొబైల్ వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రెడ్ క్రాస్ సంస్థ అత్యున్నత సేవలు, అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎలాంటి కొరత లేకుండా ఉచితంగా రక్తం అందించిందని రాష్ట్ర గవర్నర్ ప్రశంసించడం జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కృషి అని అన్నారు. భవిష్యత్తులో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అనంతరం 2019-20 సంవత్సరంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అత్యధికంగా రక్తదానం అందించిన వివిధ సేవా సంస్థలు ప్రతినిధులను కలెక్టర్ ఈ సందర్భంగా సన్మానించారు. జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై.డి.రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రెడ్ క్రాస్ సంస్థలు అన్నింటిలో ఎక్కువ రక్త నిల్వలు ఉన్న సంస్థగా తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రశంసలు అందుకుందని అన్నారు. జిల్లాలో 2019-20 సంవత్సరానికి గాను జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ (రాజమండ్రి) ఒకే రోజు 408 యూనిట్లు, ఆదిత్య విద్యా సంస్థలు నాలుగు క్యాంపులు ద్వారా 548 యూనిట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా 260 యూనిట్లు, ఓఎన్జీసీ సంస్థ ద్వారా 301 యూనిట్లు, అలాగే వివిధ పోలీసు శాఖల ద్వారా 298 యూనిట్లు రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థకు అందించడం జరిగిందన్నారు. కాకినాడకు చెందిన బాదం బాలకృష్ణ అత్యధికంగా 78 సార్లు రక్తదానం చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవింద్ మోర్బలే, ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, రిలయన్స్ సంస్థ  అధికారి పి. సుబ్రహ్మణ్యం, పోలీసు సబ్ ఇనస్పెక్టర్ కె. భీమారావు, రెడ్ క్రాస్ కార్యదర్శి కె. శివకుమార్, రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణాధికారి ఎస్. మల్లేశ్వరరావు, రెడ్ క్రాస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us