UPDATED 13th DECEMBER 2018 THURSDAY 8:00 PM
పెద్దాపురం: జిల్లాలో అగ్నిమాపకశాఖ నూతన భవనాల నిర్మాణాల నిమిత్తం రూ.4కోట్లు నిధులు మంజూరైనట్లు జిల్లా అగ్నిమాపకశాఖ సహాయాధికారి జె. రమణయ్య అన్నారు. పెద్దాపురం-జగ్గంపేట రహదారిలో ఉన్న అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో
అమలాపురం, ప్రత్తిపాడు, మండపేట, జగన్నాధపురం తదితర ప్రాంతాలతో నూతన కార్యాలయాలతో పాటు జిల్లా అగ్నిమాపక శాఖ నూతన కార్యాలయం కూడా నిర్మించడం జరుగుతుందని, ఒక్కో భవన నిర్మాణానికి సుమారు రూ.70 లక్షలు నుంచి రూ. కోటి ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సంస్థలు విధిగా అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందాలని, తమ శాఖ నుంచి అనుమతులు పొందని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం అగ్నిమాపకశాఖాధికారి బంగారపు ఏసుబాబు, తదితరులు పాల్గొన్నారు.







