UPDATED 12th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక గణపతినగరం వద్ద సుమారు1500 మట్టి వినాయకుని ప్రతిమలను బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలి, నీరు ఈ రెండూ ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత స్వేచ్ఛగా ఆయురారోగ్యాలతో మనం జీవించవచ్చని, ఈ స్వచ్ఛత కోసం పాటుపడేలా మన పండగలు ముడిపడి ఉంటాయని, అందులో ప్రధానమైందే వినాయక చవితి ఉత్సవాలు అని అన్నారు. చెరువుల్లో తొలగించిన పూడిక మట్టితో తయారైన వినాయకులతోపాటు చెరువులోకి వదిలే కొన్ని రకాల ఆకులు, ఫలహారాలు, జలరాశులు మనుగడ సాగిస్తాయని, కానీ రానురాను ఆధునిక పోకడలు పోటీతో విషపూరిత రసాయనాల మిళిత ప్రతిమలతో పర్యావరణానికి చేటు తెస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి గణపతులనే పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోపార్టీ నాయకులు ముత్యం రాజబాబు, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, మద్దాల శ్రీను, సేపేని సురేష్, శెట్టిబత్తుల దుర్గ, పిళ్లా సురేష్, గోపు మురళి, నేతల హరిబాబు, గంగిరెడ్డి కృష్ణమూర్తి, చిట్టూరి లక్ష్మణరావు, ఎండి ఉబేదుల్లా, పుట్టా సూరిబాబు, కరణం సురేష్, అడబాల వీరభద్రరావు, తదతరులు పాల్గొన్నారు.







