UPDATED 28th MAY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: విద్యలో వెనుకబడిన విద్యార్థులు జ్ఞానధార కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసి సభ్యురాలు గుమ్మళ్ల విజయలక్ష్మి రామకృష్ణ అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో ఎంఈవో వై.వి. శివరామకృష్ణయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన జ్ఞానధార ప్రత్యేక బోధనా తరగతులను జెడ్పీటీసి ముఖ్య అతిథిగా పాల్గొని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో 5, 9 తరగతుల్లో సి, డి గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇతర విద్యార్థులతో సమానంగా రాణించేందుకు ప్రభుత్వం చేపట్టిన జ్ఞానధార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపిడివో కె. స్వప్న మాట్లాడుతూ విద్యార్థుల విద్యావికాసానికి జ్ఞానధార కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని, జులై తొమ్మిది వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో సుశిక్షితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు వివిధ అంశాలను భోధిస్తారని, వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జ్ఞానధార అమలుచేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, తదితరులు పాల్గొన్నారు.







