UPDATED 4th DECEMBER 2018 TUESDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఆఖరి సంవత్సరం బిబిఎ విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ కంపెనీ కాన్ సెంట్రిక్ విద్యార్డులకు వ్రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి, అందులో విశేష ప్రతిభ కనబరిచిన 22 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనంగా రూ.2.2 లక్షలు లభిస్తుందని, వైజాగ్, హైదరాబాద్ నగరాల్లో పనిచేయవలసి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు ఆంగ్లభాషపై పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్ధాశర్మ, తదితరులు విద్యార్థులను అభినందించారు.







