UPDATED 3rd JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి పేర్కొన్నారు. స్థానిక శారదాదేవి మున్సిపల్ పాఠశాల, వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, అలాగే సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ప్రతీ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా మానవహక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, ఊబా జాన్ మోజేష్, ఐసిడిఎస్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి కానుకలను చైర్ పర్సన్ పంపిణీ చేశారు.







