UPDATED 7th JANUARY 2020 TUESDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జిల్లా పశుసంవర్ధకశాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న నట్టల నివారణ మందులు పంపిణీ శిబిరాలను గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ కాకినాడ డివిజన్ ఉప సంచాలకులు, ఎస్.ఎల్.బి.పి ఉప సంచాలకులు డాక్టర్ బి. ప్రసాదరావు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం జె. తిమ్మాపురం గ్రామంలో సామూహిక అంతర పరాన్నజీవులు (నట్టల) నివారణ మందులు పంపిణీ శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నట్టల నివారణ ఉచిత మందుల పంపిణీ శిబిరాలను గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నట్టలతో గొర్రెలు, మేకల పొట్టలు లావుగా కనబడడం, దవడ కింద నీరు చేరడం, ఆకలి లేకపోవడం, బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు ఏర్పడి అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉందని, ముందుగా నట్టల నివారణ మందులు వాడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ శిబిరంలో సుమారు 2500 గొర్రెలు, 600 మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సహకారంతో గొర్రెలు, మేకలకు అవసరమైన మందులు, ఫీడ్ సప్లిమెంట్స్ సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై. శ్రీనివాసరావు, ఐ.ఎస్.డి.పి సహాయ సంచాలకులు డాక్టర్ అంబేద్కర్, పశువైద్యాధికారులు డాక్టర్ రాకేష్, డాక్టర్ నవీన్, ఐఎల్ఓ జివివి సత్యనారాయణ, రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ బర్రే నాగేశ్వరరావు, పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రలు, తదితరులు పాల్గొన్నారు.







