UPDATED 26th SEPTEMBER 2017 TUESDAY 9:00 PM
రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి మంగళవారం విజయదుర్గా అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. లోక స్థితికారిణిగా, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపంతో అమృతవర్షిణిగా శ్రీ మహాలక్ష్మి రూపంలోని దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున బారులుతీరారు. వేదపండితులు చీమలకొండ వీరావధాని, చీమలకొండ శ్రీనివాస్, కోట లక్ష్మీనారాయణ, నాగేంద్ర శర్మల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నవగ్రహ హోమం, కుంకుమ పూజలు,గోపూజ మొదలైన పూజాదికాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ప్రసంగిస్తూ రెండు చేతులలో కమలాలు ధరించి అభయ,వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తున్నమంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు, శుభాలు కలుగుతాయన్నారు. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిదేవి రూపంలో అర్చిస్తే ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలు చేకూరుతాయన్నారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు విశ్వనాథ గోపాలకృష్ణ, కేశాప్రగడ సత్యనారాయణ ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి), తదితరులు పాల్గొన్నారు.







