గైట్ లో ఘనంగా ప్రారంభమైన జిల్లాస్థాయి పాలిటెక్నిక్ క్రీడాపోటీలు

UPDATED 10th DECEMBER 2018 MONDAY 5:30 PM

రాజానగరం: గైట్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి అంతర్ కళాశాలల పాలిటెక్నిక్ స్పోర్ట్స్& గేమ్స్ మీట్- 2018 సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జి. రామానుజం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె. లతామాధురి ముఖ్య అతిధిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడలు సమగ్రతను, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని, దేహ ధారుడ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని అన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ ప్రధానమని, క్రీడలు ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. విశిష్ట అతిధిగా హాజరైన ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ఎస్. వరప్రసాద్ మాట్లాడుతూ మానసిక ఒత్తిడులు నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, గెలుపు, ఓటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని, దాని వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం అలవడుతుందని అన్నారు. విద్యతోపాటు క్రీడలకు సాంకేతిక విద్య తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు గుడ్లవల్లూరులో జరుగుతాయని, ప్రకటించారు. క్రీడాపోటీలు నోడల్ ఫిజికల్ డైరెక్టర్ ఆర్. విఠల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో 27 కళాశాలల నుంచి 850 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు చెన్నైలో జరిగే సౌత్ ఇండియా పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హత లభిస్తుందని పేర్కొన్నారు. గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు మాట్లాడుతూ ఈ జిల్లాస్థాయి క్రీడాపోటీలు మూడురోజులపాటు  జరుగుతాయని, నియమ, నిబంధనలు పాటిస్తూ క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ముఖ్య అతిధి లతామాధురి, క్రీడాపతాకాన్ని విశిష్ట అతిధి వరప్రసాద్, కళాశాల పతాకాన్నిజనరల్ మేనేజర్ డాక్టర్ సుబ్బరాజు ఆవిష్కరించారు. తొలుత క్రీడా వందనం స్వీకరించిన అనంతరం బెలూన్లను గాలిలోకి వదిలి పోటీలు ప్రారంభమైనట్లు లాంఛనంగా ప్రకటించారు. 800  మీటర్ల పరుగుపందెంలో విజేతలుగా నిలిచిన కె. సాయిమీనాక్షి (ప్రథమ), పి. శ్రావణి (ద్వితీయ), కె. రామలక్ష్మి (తృతీయ) బహుమతులుగా పతకాలను లతామాధురి అందచేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఎస్పీ నామగిరి బాబ్జి, రాజానగరం సిఐ వి. సురేష్ బాబు, వ్యాయమ అధ్యాపకులు సిఎం హెన్రీ, శివ, అప్పారావుదొర, క్రీడాపోటీలు పరిశీలకులు రాంజీ, రాజారావు, తదితరులు పాల్గొన్నారు.                          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us