UPDATED 26th MARCH 2019 TUESDAY 5:30 PM
పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి శాసన సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసిన 14 మంది అభ్యర్థులలో ఒక నామినేషన్ ను తిరస్కరించి 13 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడం జరిగిందని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మెయిన్ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పతో పాటు తెలుగుదేశం పార్టీ తరుపున నిమ్మకాయల రంగనాగ్ కూడా నామినేషన్ దాఖలు చేసారని, మెయిన్ అభ్యర్థి అయిన నిమ్మకాయల చినరాజప్ప నామినేషన్ అంగీకరించడం వల్ల నిమ్మకాయల రంగనాగ్ నామినేషన్ ను తిరస్కరించినట్లు తెలిపారు. మిగిలిన 13 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని, వారి నామినేషన్లను అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని ఆర్వో తెలిపారు. ఆమోదించిన 13 మంది అభ్యర్థులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల దొరబాబు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట రామ్ కుమార్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) అభ్యర్థిని తోట సరస్వతి (వాణి), పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వేటుకూరి అమ్మన్న, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర, జనజాగృతి పార్టీ అభ్యర్థిని కలిదిండి రమణమ్మ, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కొండేపూడి రవిబాబు, జనసేన పార్టీ అభ్యర్థి తుమ్మల రామస్వామి(బాబు), ముందడుగు ప్రజాపార్టీ అభ్యర్థి దివిలి సతీష్, స్వతంత్ర అభ్యర్థులు తోట వెంకట నరసింహం, జోకా వెంకట శ్రీనివాస విజయకుమార్, తుమ్మల శ్రీ ఆంజనేయులు నామినేషన్లు ఆమోదించినట్లు ఆర్డీవో వసంతరాయుడు తెలిపారు. ఈ నెల 28వ తేదీన అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని ఆర్వో తెలిపారు.







