* ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 30th JUNE 2020 TUESDAY 6:30 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 47 వందన్ వికాస కేంద్రాల ద్వారా ఏడు మండలాల పరిధిలోని గిరిజనుల జీవనోపాధి పెంపొందించేందుకు సమన్వయంతో కృషి చేయాలని సబ్-కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో వెలుగు, అటవీ, జిసిసి, పరిశ్రమలు, ఆగ్రోస్ విభాగాలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించి వందన్ వికాస కేంద్రాలు ప్రతిపాధనలు సమర్పణ, నిర్వహణ విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో లభించే షీకాయి, చింతపండు, కొండచీపుర్లు, పసుపు, జాఫ్రా, తెనే, తూనికాకు, నేలవేము, తదితర గిరిజన చిన్నతరహా ఫలసాయాలను గిట్టుబాటు ధరకు అమ్ముకుని ఆర్ధికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వందన్ వికాస కేంద్రాలను నెలకొల్పేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. వీటి నిర్వహణ కొరకు ఇప్పటికే గ్రూపులను నియమించి వారి పేరున బ్యాంకు ఖాతాలు ప్రారంబించామని, ఏయే తరహా ముడి సరుకును సేకరించి విలువ ఆధారంగా మలిచి పచ్కింగ్ చేసి గిట్టుబాటు ధర పొందాలనుకుంటున్నారో ప్రతిపాదనలు వెలుగు కమ్యూనిటీ సమన్వయకర్తలు ద్వారా సమర్పించాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఆగ్రేస్ మేనేజర్లు కేంద్రానికి అవసరమైన యంత్ర సామాగ్రిని అందించడం జరుగుతుందని, అలాగే ప్యాకింగ్, నిర్వహణ, ప్రోసెసింగ్ కు అవసరమైన శిక్షణ ఇస్తారన్నారు. అటవీ శాఖాధికారులు సీజనల్ గా ఏయే రకాలు చిన్నతరహా ఫలసాయాలు లభిస్తాయో గుర్తించిన ప్రకారం వందన్ కేంద్రాల నిర్వహణకు తోడ్పాటునందించాలని, అలాగే వాటి ప్రోసెసింగ్ నిర్వహణకు అవసరమైన సూచనలు వందన్ వికాస కేంద్రాల నిర్వహకులకు అందించాలన్నారు. గిరిజనులు తాము సేకరించిన చిన్న తరహా ఫలసాయాలు ఇప్పటివరకు గిరిజన సహకార సంస్థకు అమ్ముకునే వారని ఇప్పుడు వందన్ వికాస కేంద్రాలకు కూడా అమ్ముకుని గిట్టుబాటు ధరలు పొందాలన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాలు పెంపొందించుకోవడమే లక్ష్యంగా పని చేయాలని, డిమాండ్- సప్లయిలు నిర్వహణ వ్యయాలను బేరీజు వేసుకొని యూనిట్ల నిర్వహణకు ముందుకు సాగాలన్నారు. వందన్ వికాస కేంద్రాలు నిర్వహణకు అవసరమైన పెట్టుబడిని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, రవాణా సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రాల నిర్వహణలో సామాజిక సమన్వయకర్తలు, పరిశ్రమలు ప్రోత్సాహకమండలి అధికారులు కీలక భూమిక పోషించాలని, తెలుగు ఎపిడి నోడల్ అధికారి కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిడి వై. సత్యంనాయుడు, జిసిసి డిఎం ఎం. జగన్నాధరెడ్డి, ఆగ్రోస్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి దొర, వెలుగు, అటవీ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







