* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
UPDATED 22nd OCTOBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: సమస్యల పరిష్కారానికి నగరదర్శిని దోహదపడుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక 23వ వార్డులో సోమవారం ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా శెట్టిబలిజపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్యను, అలాగే వారికి అందజేస్తున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది చిన్నారులు కేంద్రానికి వచ్చేలాగా చూడాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం మంత్రి ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలలో పింఛన్లు ఇప్పించమని, హౌసింగ్ స్కీమ్ కింద గృహాలు కావాలని, ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలను మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. అలాగే బస్ స్టేషన్ పరిశీలించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మంత్రి స్వయంగా ప్రయాణికులను కలుసుకుని సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర చంద్ర ప్రసాద్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, బడుగు శ్రీకాంత్, నాగం రవిచంద్ర, కురుకూరి సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







