UPDATED 21st NOVEMBER 2018 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో గల ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల గ్రౌండ్స్ లో తూర్పుగోదావరి జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సౌజన్యంతో ఫుట్ బాల్ లీగ్-2 పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 12 టీములు పాల్గొనే ఈ పోటీలు లీగ్ పద్దతిలో జరుగుతాయని అన్నారు. మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు ప్రధమ బహుమతిగా రూ.40వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30వేలు, తృతీయ బహుమతిగా రూ.20వేలు, నాల్గవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.10వేలు నగదు, ట్రోఫీలతో పాటు, పోటీలలో పాల్గొన్న ప్రతీ క్రీడాకారునికి ధృవీకరణ పత్రాలు అందచేస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజి తెలిపారు. ఆదిత్య ఫుట్ బాల్ లీగ్ సెక్రటరీ గంగాధర్ మాట్లాడుతూ ఈ పోటీలు పూర్తి క్రీడాస్ఫూర్తితో జరుగుతాయని, అనుభవజ్ఞులైన రిఫరీల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని, మొదటి లీగ్ గత సంవత్సరం రంగరాయ కళాశాల క్రీడాప్రాంగణం (కాకినాడ)లో జరిగాయని, నేడు ఇక్కడ జరగడానికి సహకరించిన ఆదిత్య యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. క్రికెట్, కబడ్డీ ఆటలకు ఉన్న ప్రాధాన్యం ఫుట్ బాల్ క్రీడకు లేకపోయడం బాధాకరమని, అయితే ఈ క్రీడలో కూడా ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయిలో ఉన్న క్రీడాకారులు చాలా మంది ఉన్నారని గంగాధర్ పేర్కొన్నారు. వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి క్రీడా స్పూర్తితో పోటీలు జరగాలని, మంచి స్నేహపూర్వక వాతావరణంలో క్రీడాకారులంతా విజయానికి కృషి చేయాలని అన్నారు. పతాకావిష్కరణ, క్రీడాకారుల గౌరవ వందనం అనంతరం బెలూన్ లు గాలిలోకి వదిలి పోటీలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంటర్ నేషనల్ స్టూడెంట్స్ కో-ఆర్డినేటర్ పరంజీత్ సింగ్, తూర్పుగోదావరి అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ టి.వి.ఎస్. రంగారావు, తూర్పుగోదావరి ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. నాగేంద్ర కిషోర్, జాయింట్ సెక్రటరీ పి. శ్రీనివాస్, కోకోకోలా ఏరియా మేనేజర్ అప్పన్నదొర, తదితరులు పాల్గొన్నారు.







