* ఏపీలో ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిన టీడీపీ
* ప్రభంజనం సృష్టించిన వైసీపీ
* లోక్‌సభ ఫలితాల్లోనూ అదే జోరు.. నాలుగు జిల్లాల్లో క్లీన్‌స్వీప్
UPDATED 24th MAY 2019 FRIDAY 11:00 AM
రెడ్ బీ న్యూస్ : ఆంధ్రపదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత స్వల్ప ఓటింగ్ శాతంతో అధికారాన్ని చేజార్చుకున్న వైసీపీ తాజా ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. రాష్ట్ర ప్రజలు యువశక్తికి పట్టం గట్టారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 150 స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఫ్యాను గాలి తుఫాన్‌గా మారడంతో కొట్టుకుపోయిన సైకిల్ కేవలం 24 స్థానాలను గెలుచుకుంది. లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ ఎదురులేని శక్తిగా నిలిచింది. మొత్తం 25 ఎంపీ సీట్లకుగాను ఏకంగా 22 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన ఒకేఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను మించి వైసీపీ సీట్లు గెలవడం విశేషం. వైఎస్ జగన్ ఈనెల 30 తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీలో ఘన విజయం సాధించిన జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్, తదితరులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పలువురు ప్రభుత్వ అధికారులు జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో వైసీపీ ఏకంగా మూడు జిల్లాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేసింది. తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేసిన పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. మార్పు కోసమంటూ విస్తృత ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. పొత్తు పెట్టుకున్న వామపక్షాలు సైతం ఉనికిలో లేకుండాపోయాయి. రాష్ట్రంలో హద్దుమీరిన అవినీతి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల దౌర్జన్యాలు, రాజకీయంగా చంద్రబాబు స్వయంకృతాపరాధాలు టీడీపీని కోలుకోని రీతిలో దెబ్బతీశాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీనికితోడు గాడితప్పిన పాలన, ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం ప్రజలను విసుగెత్తించాయని పేర్కొంటున్నారు. అన్నింటికి మించి అటు ఢిల్లీలో, ఇటు ఏపీలో బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగి, ఎన్నికలకు కొద్ది నెలల ముందు బయటకు వచ్చి హైడ్రామాకు తెరతీయడం ఆ పార్టీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ రాజకీయాలు, నిరసనల పేరిట భారీఎత్తున ప్రజాధనాన్ని వృథాచేయడం కూడా ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. గత నెల 11న జరిగిన పోలింగ్ సరళిలోనే ఈ ఫలితాల తాలూకు ఛాయలు కనిపించాయి. పెద్దఎత్తున మహిళలు రాత్రి వేళల్లోనూ పడిగాపులు కాసి ఓటేయడం ప్రజా వ్యతిరేకతకు అద్దం పట్టింది. తన ఓటమిని ముందుగానే గుర్తించిన చంద్రబాబు ఈవీఎం లోపాలంటూ ఎన్నికల సంఘాలపై ఫిర్యాదులు చేసుకుంటూ సాకులు వెతుక్కున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో కొత్త ఏపీ అభివృద్ధికి ఆ రాష్ట్ర సీఎంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు.. ఆ పనిని పక్కనపెట్టి నిత్యం తెలంగాణతో ఘర్షణపూరిత వైఖరిని అనుసరిస్తూ వచ్చారు. మాట్లాడితే హైదరాబాద్‌ను తానే సృష్టించానని, అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్రస్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తప్ప మరేం లేదు. అన్నీ తాత్కాలిక భవనాలతో నడుపుకొచ్చిన చంద్రబాబు తీరు ప్రజల్లో అపనమ్మకం కలిగించిందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల్లోనూ తాను గత ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, చేపట్టిన పనులను ప్రజలకు వివరించకుండా కేవలం దేశ ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు లాభిస్తాయని చంద్రబాబు భావించినా అవేమీ ఫలించలేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాసంక్షేమమంటే కేవలం ఎన్నికల ముందు ఓట్ల కొనుగోలు పథకాలుగా చంద్రబాబు భావించారనే విమర్శలున్నాయి. అందుకే ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు పాలనను గాలికొదిలి, చివరి ఐదారునెలల్లో ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేందుకు ప్రయత్నించారు. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి వంటి వాటికింద వేల కోట్లు పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేయాలని చూశారు. కానీ ఈ పథకాల వెనుక పథకాన్ని గమనించిన ప్రజలు దానిని ఎన్నికల జమ్మిక్కుగానే గ్రహించి అదునుచూసి దెబ్బకొట్టారు. వైసీపీ విజయంలో మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు వేయడం కూడా కీలకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.







