* తెరుచుకున్న పాఠశాలలు
* అట్టహాసంగా రాజన్న బడిబాట
UPDATED 12th JUNE 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: బడి గంటలు మ్రోగాయి. .వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు కొత్త విద్యా సంవత్సరంలో అడుగు పెట్టారు. బుధవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. కొత్త తరగతి.. కొత్త వాతావరణం.. పాత మిత్రులను కలుసుకోవడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపించింది. ఒకరినొకరు పలకరించుకున్నారు. మొత్తానికి తొలిరోజు సామర్లకోట పట్టణ, మండల పరిధిలో గల పాఠశాలల్లో సందడి నెలకొంది. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ విద్యను ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సౌకర్యాలతో పాటు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను చేర్పించి వారి బంగారు భవితకు బాట వేయాలని కోరారు. ఉపాధ్యాయుల అంకితభావంతో తమ పాఠశాల పట్టణ స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా, ఎన్ఎంఎంఎస్ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో ప్రతీ యేటా విద్యార్థులు ఎంపిక కావడంతో అడ్మిషన్లు పెరిగాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఒక్కో జత బూట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిడి తాళ్లూరి వైకుంఠం, షఫీయుల్లా, రాజు గోవిందు, ఏ.ఎల్.వి. కుమారి, కె. అరుణ, కె.వి.వి. సత్యనారాయణ, శ్రీనివాస్, వల్లి, ఏపీ రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.







