*అనుమతి లేకుండా బహిరంగసభలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
*జిల్లా ఎస్పీ విశాల్ గున్ని
UPDATED 28th JANUARY 2019 MONDAY 5:30 PM
పెద్దాపురం: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 31వ తేదీన చేపట్టనున్న ఛలో కత్తిపూడి సభకు పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషనును సోమవారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ పోలీస్ శాఖ నుంచి అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు గతంలో నిర్వహించిన సభలతో పాటు నిన్న జరిగిన బీసీ సభ కూడా పోలీస్ శాఖ అనుమతులతోనే జరిగాయని, అలాగే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సభకు అనుమతి కోరితే చట్టప్రకారం పరిశీలిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించే సభలకు వెళ్ళి ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ జి. యువకుమార్, ఎస్ఐ ఎ. కృష్ణభగవాన్, తదితరులు పాల్గొన్నారు.







