UPDATED 18th JUNE 2018 MONDAY 7:30 PM
పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆరు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.బి.బి. వసంతరాయుడు తెలిపారు. గండేపల్లి మండలానికి చెందిన ఎ. రత్నం భూమిని విచారణ చేసి న్యాయం చేయమని, తుని మండలం హంసవరంకు చెందిన ఎం.రామదాస్ భూమికి సంబంధించి శాటిలైట్ సర్వే చేయించి న్యాయం చేయమని, కోటనందూరు మండలం అల్లిపూడికి చెందిన ఆర్. వెంకటేశ్వర్లు రెవెన్యూ రికార్డులో తప్పులను సవరణ చేయమని, పెద్దాపురంకు చెందిన కె. దేవి హౌసింగుకు సంబంధించిన బిల్లులు చెల్లించమని, టి. యేసుబాబు దళిత, బలహీన వర్గాల సంఘం అన్నవరంకు చెందిన ప్రభుత్వ పత్రాలు సంతకాలు ఫోర్జరీ చేసి దళితుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవాలని, అలాగే ఇళ్ళు లేని నిరు పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, పెద్దాపురంకు చెందిన బి. సూర్యనారాయణమూర్తి, సభ్యులు పెద్దాపురం నుంచి అన్నవరం, తుని, రావులపాలెం, ప్రత్తిపాడు, తామరాడ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించమని అర్జీలు వచ్చాయని, ఈ అర్జీలు పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాఖాపరంగా ప్రజలకు సమస్యలు ఉంటే ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవాలని ఆర్డీవో కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.







