UPDATED 29th JULY 2017 SATURDAY 4:00 PM
కాకినాడ : ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించటానికి పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ విశాల్‌గున్ని, జాయింట్ కలెక్టర్ మల్లికార్జున, ట్రైనీ కలెక్టర్ ఆనంద్‌తో కలిసి వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ వేడుకలు నిర్వహించాలని, విద్యార్థులు ఎక్కువగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించాలని, స్టాల్స్‌ను ఏర్పాటు చేసి అక్కడ అతిథులతో ఉపకరణాలు పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేయాలన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు పంపిణీ, ప్రభుత్వ శాఖల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసాపత్రాల సంఖ్యను నిర్ధిష్టమైన స్థాయిలో నివేదించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.







