హరికృష్ణ మృతికి సంతాపం

UPDATED 29th AUGUST 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: దివంగత నందమూరి తారకరామారావు తనయుడు, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన మృతికి స్థానిక టిడిపి నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి హరికృష్ణ ఇక లేరనే విషయాన్ని వారు జీర్జించుకోలేకపోయారు. బుధవారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. హరికృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నికల ప్రచార సభలను హరికృష్ణ రథసారథిగా ముందుండి నడిపించిన తీరును, నాటి సంగతులను టిడిపి నాయకులు నెమరువేసుకున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నిజమైన రాజకీయ నేతగా హరికృష్ణ నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఆయన లేని లోటు ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, టిడిపికి తీరని లోటని అన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంలో హరికృష్ణ 23 జిల్లాల్లో చైతన్య రథంలో 9 నెలలపాటు తిరిగి అలుపెరగని సారథ్య బాధ్యతలు నిర్వహించి ఎన్టీఆర్‌కు అండగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్‌ మరణించిన తర్వాత హిందూపురం నుంచి హరికృష్ణ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని, రవాణా శాఖా మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు ఎనలేని సేవలందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, బడుగు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us