* ప్రభుత్వ పాఠశాలలకు విశేష ఆదరణ
* విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత
* పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అన్నీ ఉచితం
* ఈ ఏడాది నుంచి ఉచితంగా బూట్లు, సాక్సులు..
UPDATED 18th JUNE 2019 TUESDAY 11:30 AM
రెడ్ బీ న్యూస్ ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల చేరికలో జోష్ పెంచుతున్నాయి. విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే ఒకప్పుడు ఉన్న చిన్నచూపు చాలా వరకు పోయి, ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమానికి వేదికగా మారుతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఇప్పటికే లక్షలాది పుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. త్వరలో బూట్లు, సాక్సులు కూడా అందించనున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సైతం అడ్మిషన్ల వేళ ప్రచారం చేసి విద్యార్థులను విస్తృతంగా చేరుస్తున్నారు. నూతనంగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకంపై భరోసా ఇచ్చింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ అమ్మఒడి పథకం కింద పాఠశాలకు పంపే ప్రతీ విద్యార్థికి రూ.15,000 జమ చేస్తామని అన్నారు. ఇటీవల జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సైతం ఇందుకు ఆమోద ముద్ర వేశారు. 2020 జనవరి 26వ తేదీ నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధం అయింది. అయితే ఇది ప్రభుత్వ పాఠశాలకేనా లేక ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు సైతం కూడా వర్తిస్తుందా అన్నదానిపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. వీటి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటిస్తేనే పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. ఒకవేళ కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే వర్తిస్తుందంటే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని, పాఠశాలల్లో చేరికలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు.







