UPDATED 27th AUGUST 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఏడవ వార్డులో మంత్రి సోమవారం పర్యటించి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సామర్లకోట పట్టణ అభివృద్ధిలో భాగంగా అన్ని వార్డుల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏడవ వార్డులో నూతనంగా నిర్మించిన రెండు సిసి రోడ్లును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి పెద్దాపురం పాండవుల మెట్ట వరకు రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైటింగుతో రహదారులను నిర్మిస్తున్నామని, అలాగే చెఱువులను ఆధునీకరించి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మన్యం చంద్రరావు, శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, వార్డు కౌన్సిలర్లు, బడుగు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.







