UPDATED 9th FEBRUARY 2018 FRIDAY 8:30 PM
కాకినాడ: బాలుడి కడుపులో నుంచి రూ. ఐదు నాణాన్ని తొలగించిన ఘనతను కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు దక్కించుకున్నారు. ఆపరేషన్ లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో దాన్ని బయటకు తీసి ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన మోతి శివప్రసాద్, దుర్గ దంపతుల కుమారుడు నాగబాబు(10) ఐదు రూపాయల నాణెంతో ఆడుకుంటూ అకస్మాత్తుగా మింగడంతో తీవ్రమైన వాంతులు, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బాలుడికి కాకినాడ అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ముందుగా అపోలో వైద్యుడు డాక్టర్ పంపన రాజు బాలుడిని పరీక్షించారు. మెడికల్ గ్యాస్ట్రో ఎంటరోలాజిస్ట్ డాక్టర్ అల్లు రవికుమార్ బాలుడిని పరీక్షించి నాణెం జీర్ణాశయంలో ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం బాలుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా కెమెరాను లోపలి పంపి ఫారిన్ బాడీ ఫోర్సిప్స్ ద్వారా నాణాన్ని బైటకు తీశారు. బాలుడు కుటుంబం నిరుపేద కావడంతో చికిత్సను ఉచితంగా నిర్వహించిన అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి, వైద్యులకు బాలుడి తల్లితండ్రులు కృతఙ్ఞతలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పీపీ ఛటర్జీ, కార్యనిర్వహణాధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు.







