UPDATED 6th SEPTEMBER 2022 TUESDAY 08:30 PM
Youth Set Fire Himself: ప్రేమికుల మధ్య అనేక గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇవి ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంటాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా పోతుంటాయి. అన్నీ ఉద్దేశపూర్వకంగా జరక్కపోవచ్చు. క్షణికావేశంలో కొన్ని, అనుకోని తప్పిదాల వల్ల కొన్ని జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన కూడా అలాంటిదే. ఒక యువకుడు తన ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు.
వాస్తవానికి తన ప్రేయసిని బెదిరించే క్రమంలో అనుకోకుండా అతడికి నిప్పు అంటుకుంది. 30 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ పరశురామ్ జాదవ్ అనే యవకుడు (19) సోమవారం అర్థరాత్రి వినాయక మండపాన్ని సందర్శించిన అనంతరం తన ప్రేయసితో గొడవ పడ్డాడు.
చాలా సేపు ఒక రోడ్డుపై నిలబడి ఫోన్లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంటికి వచ్చి ప్రేయసికి వీడియో కాల్ చేశాడు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఒంటికి నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో అతడి చొక్కాకి నిజంగానే నిప్పు అంటుకుంది. కాటన్ చొక్కా కావడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. యువకుడు ఫోన్ వదిలేసి అరవడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై మంటలు ఆర్పి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.







