• ఉదయం నుంచి రాత్రి వరకూ కార్యాలయంలో సోదాలు
• రికార్డులు, కంప్యూటర్లు పరిశీలించిన ఏసీబీ అధికారులు
UPDATED 24th JANUARY 2020 FRIDAY 10:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో రాజమహేంద్రవరానికి చెందిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా ఏసీబీ డీఎస్సీ పి. రామచంద్రరావు ఆధ్వర్యంలో సుమారు 12 మంది సభ్యులతో కూడిన బృందం కార్యాలయంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి రాత్రి వరకూ విస్తృతంగా సోదాలు చేశారు. ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే కార్యాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే రికార్డులు, కంప్యూటర్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను బయటకు వెళ్లకుండా అందరినీ లోపలే ఉంచి వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రెవెన్యూ విభాగంలో అవినీతి ఆరోపణలు అధికంగా వస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు ఏసీబీ అధికారులు చేపట్టారు. అలాగే ఇటీవల తహసీల్దార్ కార్యాలయంపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఇక్కడ తనిఖీలు చేసినట్లు కూడా తెలుస్తోంది. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని తనిఖీ చేయడంతో పాటు వారిని వ్యక్తిగతంగా ఏసీబీ అధికారులు విచారించి వివరాలు రాబట్టారు. ఈ మధ్య కాలంలో మంజూరు అయిన పట్టాదారు పాసు పుస్తకాలు,
భూముల ఆన్ లైన్, ఇతర రెవిన్యూ సంబంధమైన పనులు మొదలైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే తహసీల్దార్ కోనాడ పద్మావతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రెవెన్యూ సిబ్బంది భారీగా ముడుపులు స్వీకరిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దాడుల అనంతరం డీఎస్పీ రామచంద్రరావు మాట్లాడుతూ కార్యాలయంలో కంప్యూటర్ టేబుల్ క్రింద రూ. 8,500 నగదును జె. తిమ్మాపురం వీఆర్వో వి. శ్రీనివాసరావు దాచి పెట్టినట్లు గుర్తించామన్నారు. అలాగే 17 మంది రెవిన్యూ సిబ్బంది నుంచి లెక్క చూపని రూ.29,859 నగదును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా మీసేవ, టీబీఆర్ వంటి కొన్ని ముఖ్యమైన రికార్డులు నిర్వహించడం లేదని, చెన్నై నుంచి వచ్చిన 48 పట్టాదారు పాసు పుస్తకాలను తహసీల్దార్ వద్ద గుర్తించామని, అవి సంబంధిత వ్యక్తులకు అందజేయకపోవడాన్ని గుర్తించామన్నారు. అలాగే రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, గ్రీవెన్సు సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కరించడంలో సంబంధిత అధికారులు విఫలం అయ్యారని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు తిలక్, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.







