UPDATED 2nd AUGUST 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా బాలా త్రిపుర సుందరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని పచ్చని తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలుత విఘ్నేశ్వరపూజతో కార్యక్రమం ఆరంభించిన అనంతరం సామూహిక వ్రతాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు వేమూరి సోమేశ్వరశర్మ, కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, సన్నిధిరాజు వెంకన్న, చెరుకూరి రాంబాబుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో పులి నారాయణమూర్తి మాట్లాడుతూ రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయించుకునే భక్తులు తమ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతీ శుక్రవారం ఉదయం 9:15 నిముషాలకు వ్రతాలు ప్రారంభమవుతాయని, విఘ్నేశ్వర, వరలక్ష్మీ అమ్మవారి పూజ సామాన్లు భక్తులు తమ వెంట తీసుకురావాలని అన్నారు. అమ్మవారి నివేదన ప్రసాదం వరలక్ష్మి రూపులు, తోరణాలు, గాజులు దేవస్థానం, దాతల సహాయ సహకారాలతో ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు శ్రీ భీమేశ్వర అన్నదాన ట్రస్టు వారిచే భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.







