UPDATED 30th OCTOBER 2018 TUESDAY 5:00 PM
రాజానగరం: యువ ఇంజినీర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు సేవలు అందించాలని ప్రొఫెసర్ విలియం ఓక్స్ అన్నారు. స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలను ఇండో యుఎస్ కన్సార్టియం ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఐయుసిఇఇ- ఇపిక్స్ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యుఎస్ఎకి చెందిన పర్ డ్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం ఓక్స్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ ఇంజినీర్లు గ్రామీణ ప్రాంత ప్రజల దైనందిక వ్యవహారాలను పరిశీలించి వాటిని తక్కువ ఖర్చుతో ఆటోమేట్ చేసే మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఏ సమస్యనైనా గుర్తించి ఇంజనీరింగ్ నైపుణ్యాలతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో గైట్ కళాశాల ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత భారత్ అభియాన్ కు ఇపిక్స్ కు దగ్గరి పోలికలు ఉన్నాయని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయ, గృహావసరాలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు తయారుచేసిన పనిముట్లను పరిశీలించి వారిని అభినందించారు. రాష్ట్రంలో ఐయుసిఇఇ- ఇపిక్స్ పార్టనర్ షిప్ గా ఎంపికైన పది కళాశాలల నుంచి హాజరైన ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో ఇపిక్ కార్యక్రమాన్ని ఎ.పి.ఎస్.ఎస్ డి.సి ఇంజనీరింగ్ కళాశాలల్లో పరిచయం చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఎస్.ఎస్ డి.సి అధికారులు ఎం. కాంతారెడ్డి, అలేఖ్యాచౌదరి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. మూర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కె. సుబ్బారావు, ప్రొఫెసర్ డి.వి. రామ్మూర్తి, డైరెక్టర్ పి.ఆర్.కె. రాజు, కోఆర్డినేటర్లు విద్యశ్రీ, జయరాం కుమార్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.







