UPDATED 15th AUGUST 2019 THURSDAY 8:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల ప్రాంగణంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వందేమాతర గీతంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో తొలుత గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి యువకులు, విద్యార్థుల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. దేశం సాంకేతికంగా ఎదగాలని, అందుకు తగినట్లు విద్యార్థులు తమ జీవితాలను మలుచుకోవాలని సూచించారు. కుల, మత, వర్గ భేదాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని అన్నారు. దేశ స్వాతంత్య్రం సాధించిన యోధులను, జాతీయోద్యమంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ, వారు చూపిన బాటలో పయనించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో గైట్ ప్రాంగణంలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ ఎండి ధనరాజు, డాక్టర్ పిజి రామానుజం, వల్లీ మాధవి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ మూర్తి, డాక్టర్ లీలావతి, డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి, విశ్రాంత డిఎస్పీ ఎన్. బాబ్జీ, డైరక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







