UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో హైదరాబాద్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు రవికుమార్ పీసపాటి, కన్వీనర్ (చాప్టర్ ఎక్సటెన్షన్) డాక్టర్ ఎ.ఆర్. ఆర్యశ్రీ, కన్వీనర్ (ఎస్.డి.పి) డాక్టర్ ఎ. చలపతిరావు, ట్రైనర్ డాక్టర్ రాజేష్ ప్రసాద్, ఫౌండర్ & సిఈవో కన్స్యూమర్ సెల్యూలర్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) వి. హరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విజేతలుగా నిలవడానికి పుస్తక పరిజ్ఞానం ఒకటే సరిపోదని, వారిని బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి హెచ్ఎంఎ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కంపెనీలు, ప్రాంగణ ఎంపికలకు అవసరమయ్యే మెళకువలు, ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించి ఆ ఎంపికల్లో కొలువులు సాధించే విధంగా హెచ్ఎంఎ తయారు చేస్తుందని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు ఉపయోగపడే పరిజ్ఞానం అందించడంలో అగ్రగామిగా ఉన్నామని, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడంలో అధ్యాపకుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న రంగాల్లో రాణించడానికి అవసరమయ్యే మెళుకువలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని దైనందిక జీవితంలో అన్వయించినపుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. హెచ్ఎంఎ ద్వారా విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి తద్వారా వారు ప్రాంగణ ఎంపికల్లో సత్తా చాటడానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేత సిబ్బంది, బిబిఎ, ఐ.ఎం.బి.ఎ, ఎంబిఎ, పిజిడిఎం విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







