UPDATED 16th JUNE 2019 SUNDAY 10:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వచ్చే నెల రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ఆదివారం ఉయ్యాల తాళ్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జాగరణ ఉత్సవానికి 15 రోజులు ముందు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్థానిక పాత పెద్దాపురానికి చెందిన దళిత యువకులు పట్టణ శివారులో గల రెండు తాడిచెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ చెట్లను నరికి పట్టణంలో గల పలు వీధుల గుండా మేళతాళాలు, భాజా భజంత్రీలు, గరగల నృత్యాల నడుమ ఊరేగించి ఆఖరున ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆ చెట్లతో అమ్మవారి ఆలయం ముందు ఊయల వేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







