పరిష్కారానికి నోచుకోని పెండింగ్ సమస్యలు

* మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం 
* కౌన్సిల్ సమావేశంలో పలువురు సభ్యులు ధ్వజం

UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 10:00 PM

సామర్లకోట: పెండింగ్ సమస్యలపై ఎందుకు దృష్టి సారించడం లేదని మున్సిపల్ అధికారుల తీరుపై    అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో వైసిపి సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజెస్ మాట్లాడుతూ పట్టణంలో సెల్ టవర్ నిర్మాణానికి సంబంధించిన యజమానిపై చర్యలు తీసుకోకుండా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి మున్సిపల్ కమీషనర్ చోడగం వెంకటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ అధికారి ఎన్ఎస్ రత్నకుమార్ బదులిస్తూ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని 2017లో నోటీసులు ఇచ్చామని, దానికి గృహ యజమాని కోర్టును ఆశ్రయించాడని అన్నారు. కోర్టు ద్వారా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో ఒంటరి మహిళలకు పింఛన్లు పథకం సామర్లకోట మున్సిపాలిటీలో ఎందుకు అమలు కావడం లేదని ఇచ్చిన దరఖాస్తులపై వెంటనే సమాధానం తెలపాలని సభ్యులు పట్టుబట్టారు.మున్సిపల్ కమీషనర్, సంబంధిత అధికారి శ్రీహరి మాట్లాడుతూ సాంకేతిక లోపంతో  గడువు సమయానికి ఆ పథకం ఆన్ లైన్ చేయడం ఆలస్యమయిందని, దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామని, త్వరలోనే ఈ పథకం లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. పట్టణంలో గల వార్డుల్లో శానిటేషన్ పై దృష్టి పెట్టాలని, వాతావరణ మార్పుల వలన వ్యాధుల బారిన పడకుండా శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందడం లేదని, దీనివల్ల నిర్మాణానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారని, హౌసింగ్ అధికారులతో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు కోరారు. అక్రమ లేఅవుట్లు పట్టణంలో విపరీతంగా పెరిగాయని, వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఓటర్ల నమోదు విషయంలో అవకతవకలు ఉన్నాయని, ఉన్న ఓటర్లను లేని ఓటర్లుగా చూపిస్తున్నారని, బ్రతికున్న ఓటర్లను డిలీట్  లిస్టులో చేర్చి ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించి చేర్పులు, మార్పుల విషయంలో ఓటర్ లిస్టు ఆమోదానికి వెళ్లే ముందు కౌన్సిల్ సభ్యులకు తెలియపరచాలని సభ్యులు కోరారు. అనంతరం అజెండాలోని పొందుపర్చిన అంశాలన్నీ అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆమోదించినట్లు చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, బడుగు శ్రీకాంత్, మన్యం చంద్రరావు, చుండ్రు బలరాం, జుత్తుక సుబ్బలక్ష్మి, చాపల అపరంజి, పోలిపల్లి హైమావతి, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us