* భూమిపై సర్వహక్కులు భూయజమానికే చెందుతాయి
* భూ యజమానులు, సాగు రైతులకు మధ్య అనుసంధానకర్తగా గ్రామ సచివాలయాలు
* పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు
UPDATED 9th OCTOBER 2019 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట సాగుదారు హక్కు చట్టం-2019కు లోబడి షరతులు విడుదల చేసిందని, ఈ చట్టం క్రింద ఎవరైనా న్యాయ నిర్ణయాధికారి ముందు భూయజమానికి వ్యతిరేకంగా భూమిపై హక్కును క్లెయిమ్ చేసుకోవడానికి పంట సాగుదారు హక్కు పత్రం సాక్ష్యంగా ఉపయోగపడదని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పాత్రికేయులతో బుధవారం ఆయన మాట్లాడుతూ భూయజమానులు తమ సొంత భూములను నిర్భయంగా కౌలుకు ఇవ్వవచ్చని, ఆంధ్రప్రదేశ్ పంటల సాగు హక్కు చట్టం-2019 సెక్షన్ 5(బి) ప్రకారం ఋణ అర్హత పత్రం సాగుదారునకు 11 నెలల కాల పరిమితికి మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ కాల వ్యవధిలో పండిన పంటపై తప్ప భూమిపై ఎలాంటి హక్కులు కల్పించలేదని, భూమిపై సర్వ హక్కులు భూయజమానికి మాత్రమే చెందుతాయని తెలిపారు. సెక్షన్ 5(సి) ప్రకారం సిసిఆర్ సి కార్డుదారులు పంట ఋణము, పంటల భీమా, ఇన్ ఫుట్ సబ్సిడీ, పంట నష్టం మాత్రమే పొందగలరని, భూమిపై ఎలాంటి స్వాధీన హక్కులు, కౌలు, ఇతర ఏవిధమైన హక్కులు పొందలేరని తెలిపారు. సీసీఆర్సీ కార్డుని ఉపయోగించి రెవెన్యూ అధికారులు పట్టాదారుని భూమిపై గల హక్కును బదలాయించరాదని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు సిసిఆర్సీ కార్డుదారునకు ఇచ్చిన పంట ఋణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు ఫలసాయంపై మాత్రమే హక్కు ఉంటుందని, భూమిపై ఎలాంటి హక్కు ఉండదని తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు భూమి యజమాని, సాగు రైతులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. భూయజమానులు అందుబాటులో లేనిచో అంగీకారపత్రాన్ని ఈమెయిల్ ద్వారా ఇవ్వవచ్చునని, ఆ అంగీకార పత్రాలను విఆర్వో ధృవీకరిస్తారని తెలిపారు. రైతు భరోసా పథకం క్రింద భూ యజమానికి, కౌలు రైతులకు సంవత్సరానికి రూ.12,500 ఆర్థికసాయం అందజేస్తారని, ఈనెల 15వ తేదీ నాటికి పథకం అమలులోకి రానున్న దృష్ట్యా దీనికి సంబంధించిన అర్హత జాబితాలను సచివాలయాలకు, పంచాయతీ కార్యాలయాలకు పంపినట్లు తెలిపారు. అర్హత ఉండి పత్రాలు అందజేయడంలో పెండింగ్ లో ఉన్న వారు వాటిని సరిచేసుకుని గ్రామాల్లోని విఆర్వో కార్యాలయాల్లో రైతులకు చెందిన బ్యాంకు ఖాతాను, ఆధార్ నంబరును ఇచ్చి అప్ డేట్ చేయించుకోవాలని తెలిపారు. డి పట్టా అర్హత ఉన్న రైతుకు రైతు భరోసా పథకం వర్తించదని, రైతులు తమ భూమిని చట్టం 30/సి ప్రకారం నమోదు చేయించుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే సంవత్సరం ఉగాది నాటికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇండ్ల స్థలాలను కేటాయించడానికి అవసరమైన దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, వీటిని పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయం, సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.







