UPDATED 29th APRIL 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: ఆశీల వేలం పాటదారుడు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా మున్సిపల్ అధికారులు వారితో కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులపై ఫైర్ అయ్యారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షతన, మున్సిపల్ కమీషనర్ నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బీబీజాన్ మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్ సమయాన్ని ఇవ్వాలని కోరగా అందుకు మున్సిపల్ చైర్ పర్సన్ అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించి ఆశీలు వసూలుకు పాటపాడుకున్న పాటదారుడు మున్సిపాలిటీకి సొమ్ము చెల్లించలేదని గత కౌన్సిల్ సమావేశంలో ఆ విషయాన్ని అడగడం జరిగిందని దానికి అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు అధికారపక్ష కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, కురుకూరి సోమేశ్వరరావు మద్దతు తెలుపుతూ పాటదారుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని లేదని, తక్షణం ఏమి చర్యలు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని చెల్లించని పాటదారుడిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది మున్సిపల్ ఆర్డీకి లేఖ రాయడం జరుగుతుందని సమాధానమిచ్చారు. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు మాట్లాడుతూ ఏడాది కాలంగా ఆశీలు వసూలు చేస్తున్న పాటదారుని నుంచి అగ్రిమెంటు రాయించుకోలేదని, సొమ్మును వసూలు చేయలేదని అధికారులు, పాటదారులతో కుమ్మక్కై మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టారని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని వారి నుంచి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ అధికారులు సిబ్బందిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. అలాగే పట్టణంలో గోదావరి జలాలను శుద్ధి చేసి త్రాగునీరుగా సరఫరా చేస్తున్నామని, అయితే గోదావరి కాలువలో పరిశ్రమల నుంచి వ్యర్థజలాలు నేరుగా కలవడం వల్ల కలుషిత నీటిని ప్రజలు తాగుతున్నారని అందువల్ల వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ గోదావరి కాలువలోని నీరు కలుషితం కాకుండా తక్షణం పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ వార్డులొ కోతులు బెడద అధికంగా ఉందని వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కమీషనర్ మాట్లాడుతూ అటవీ అధికారులకు సమాచారం అందించి వాటిని పట్టుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అనంతరం కౌన్సిల్ అజెండాలోని అంశాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలోని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







