UPDATED 12th SEPTEMBER 2018 WEDNESDAY 6:30 PM
మండపేట: ప్రపంచంలోనే భారీ లడ్డు తయారీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ యాజమాన్యం వినాయక చవితికి భారీ లడ్డు సిద్ధం చేశారు. ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా 580 కేజీల భారీ లడ్డును రూపొందించారు. మండపేట పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వీరబాబు లడ్డుకు తుది మెరుగులు దిద్దారు. శివపార్వతి ఆకారంలో జీడిపప్పు పేస్టుతో రూపొందించారు. లడ్డు తయారీ పూర్తయిన అనంతరం సురుచి ఆవరణలో ఏర్పాటు చేసిన గణపతికి మిఠాయి మేస్త్రీ విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు పుల్లకవి భాస్కరరావు ఆధ్వర్యంలో సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు, ఆయన సతీమణి భారతి, కుమార్తె సాయి మనస్వినిలు విశేష పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. లడ్డు తయారుచేసిన మాలధారణ చేసిన సిబ్బంది బోలో గణేష్ మహరాజ్ అంటూ నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని లడ్డును సందర్శించారు. సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీపడ్డారు. మేళతాళాలతో ఊరేగింపుగా అలంకరించిన వాహనంపై హైదరాబాద్ తరలించారు. అక్కడ ఫిలిం నగర్ లోని దైవ సన్నిధానంలో ఏర్పాటు చేసిన గణపతికి మహా నైవేద్యంగా ఈ లడ్డు ప్రసాదాన్ని గురువారం వినాయక చవితి సంధర్భంగా సురుచి అధినేత పోలిశెట్టి మల్లిబాబు సమర్పించనున్నారు. ఈ మొత్తం ఏర్పాట్లు పిఆర్వో ఉప్పలపాటి రామభద్రరాజు వర్మ పర్యవేక్షించారు.







