UPDATED 23rd APRIL 2018 MONDAY 7:00 PM
గంగవరం: ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ఉద్యమాలు చేపట్టాలని రంపచోడవరం శాసన సభ్యురాలు వంతల రాజేశ్వరి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ గంగవరం మండలం మొల్లేరు నుండి మోహనపురం వరకు సుమారు 70 కిలోమీటర్లు సాగిన బైక్ ర్యాలీలో ఆమె సోమవారం పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో గెలవకుండా ఉండాలని నాడు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని విభజించాయని, రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా కొంత మంది పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా మనందరి హక్కు అని, స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ చేయిచేయి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు శీతంశెట్టి వెంకటేశ్వరావు, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ వై. వేణు గోపాల్, ఎంపీపీ, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.







