UPDATED 30th DECEMBER 2019 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): జనవరి 8వ తేదీన జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాద్యక్షులు దువ్వా శేషుబాబ్జి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక లారీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు నష్టంగా ఉన్న రోడ్ సేఫ్టీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లనే భాద్యులను చేస్తున్నారని, రోడ్లు నిర్మాణం చేయని ప్రభుత్వానిది బాధ్యతేనని అన్నారు. మద్యం సేవించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జాతీయ రహదారులపై మద్యం అమ్మరాదని చెబుతూనే కూతవేటు దూరంలోనే మద్యం అమ్ముతున్నారని ఇది ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మద్యం తాగి వాహనం నడిపినపుడు తప్పని, మరి మద్యం అమ్మి ప్రభుత్వం నడపడం రైట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. పెనాల్టీలు భరించలేని విధంగా వేస్తున్నారని, జాతీయ రహదారిపై 100 కిలోమీటర్లుకు ఒక విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని, డీజిల్, పెట్రోల్ జిఎస్టి పరిధిలోకి తెచ్చి లీటరు రూ.40/-కు అందించాలని డిమాండ్ చేశారు. అధిక టోల్ టాక్స్ ను తగ్గించాలని, తదితర డిమాండ్లతో అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చక్రరావు, కార్యదర్శి వెంకన్నదొర, సీఐటీయూ మండల ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్, అధిక సంఖ్యలో వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.







