అకాలవర్షాలకు కోతదశలో ఉన్న వరి పంటలో జాగ్రత్తలు తీసుకోవాలి

ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు

UPDATED 2nd MAY 2023 TUESDAY 7:00 PM

Senior Scientist Dr. Challa Venkata Narasimharao : ఇటీవల కురుస్తున్న అకాలవర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లావ్యాప్తంగా 18.9 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు అయిందని, ముఖ్యంగా పన మీద కళ్లాల్లో ఉన్న వరిపంట దెబ్బతింటే తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉన్నమీదట రైతులు తగిన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా (Kakinada District) ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు పలు సూచనలు చేశారు. 

కాకినాడ జిల్లాలో దాళ్వాలో 65,352 హెక్టార్లలో సాగుకి 47 శాతం మేర అనగా 30,441 హెక్టార్లలో ఇప్పటికే కోతలు పూర్తయ్యాయని అన్నారు. 2657 హెక్టార్లలో వరి పడిపోగా 2007 హెక్టార్లలో పనలపైన, 510 హెక్టార్ల మేర కుప్పలపైనా, 2318 హెక్టార్లు కళ్ళాలపైనా ఉండగా, కళ్ళాలపైన 20,718 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందన్నారు.

గింజ గట్టిపడే దశ నుండి కోత దశలో చేను పడిపోకుండా ఉండి, నిద్రావస్థ కలిగిన రకాలలో నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేని రకాలు నీటమునిగితే కంకిపైనే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. కొన్ని నిద్రావస్థ కలిగిన రకాలలో కూడా చేను పడిపోయి వారం రోజులకన్నాఎక్కువగా నీట మునిగినట్లైతే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలకవచ్చే అవకాశం ఉందన్నారు. 

ప్రస్తుతం తీసుకోవలసిన జాగ్రత్తలు 

మనుషులతో కోత కోసిన పనలు వర్షానికి తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని(లీటరు నీటికి 50 గ్రా.) పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేనట్లయితే మడిలోనే పనలపై ఉప్పు నీరు చల్లుకోవాలి. ఒకవేళ పొలంలో నీరు నిలిచి ఉన్నట్లయితే పనలను గట్టు పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవడం ద్వారా మొలకెత్తకుండా రంగు మారకుండా నివారించవచ్చును. 

కుప్పవేసే సమయంలో తుఫాను వాతావరణం వల్ల పనలు తడిసినట్లయితే కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చును. నూర్చిన ధాన్యం 2-3 రోజులు ఎండబెట్టడానికి వీలుకాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్నినివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చును.

ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పారబట్టి నిల్వ చేసుకోవాలి. చివరిగా పూర్తిగా తడిసి రంగు మారిన ధాన్యానికి మార్కెట్ పూర్తిగా తగ్గిపోతుంది కనుక ఇలాంటి ధాన్యం పచ్చి బియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us